20, జూన్ 2016, సోమవారం

తెలంగాణ  తెలుగు 

గప్పట్ల, అంటే ఒక  యాన్నర్థం కింద బిచికుంద కాలేజీల తెలుగు సెమినార్  వెట్టిండ్రు.  నన్ను గూడ  ఏదో మర్యాద   కోసం విల్చిండ్రు.  ఎందుకంటే పక్క కాలేజీల పనిచేస్తున్న సీనియర్ పంతుల్నని గావచ్చు.  నా మాతృ బాస తెలుగే.  కానీ నేను చెప్పే సదువు తెలుగు గాదు. నేను  వేరే సబ్జక్టు చెప్త.  అంటే నాకు తెలుగు భాషమీద అంత పట్టు లేదు. కానీ ఆడ  గుసున్న పిల్లల గురించి ఒక ముచ్చట  చెప్పాల .  ఈ ఉత్తరం సదువుతున్న శాన మందికి బిచుకుంద సంగతి తెల్వదు.  బిచుకుంద,మద్నూర్ సుట్టుపక్కల మనుషులు ఎన్ని బాసలు మాట్లాడతరో చెప్త. ఓ పక్క కన్నడ దేశం ఉన్నది. 
అందుకని ఆడ  కన్నడ మాట్లాడేటోల్లు  మస్తుమందున్నరు.  ఇంకో దిక్కు మరాఠీ మాట్లాడేటోల్లు గూడ మస్తుగనే ఉన్నరు . ఎందుకంటే మహారాష్ట్ర పక్కకే  ఉన్నది.  ఇగ మన తెలంగానా ల ఉన్నది గాబట్టి తెలుగోల్లు ఉన్నరు.  ఆడ మన పోరగాళ్లకు బాస తోని పెద్ద పంచాయితే  ఉన్నది.  ఒక తుర్క పిల్లగాడు గావచ్చు లేక పోతే  ఒక లంబడి  పిల్ల గావచ్చు, ఆల్ల బాధ చెప్ప రాదు.   ఎందు కంటరా ? ఇంట్ల ఉర్దూ బాస ,లేక వోతె లంబడి బాస మాట్లాడాల. ఔతలికి వోతె  తెలుగు, కన్నడ , మరాఠీ  బాసలు కొంచమన్నతెల్వాల. ఈ సంగతి పక్కకు  వెడితే తెలుగు  (తెలుగు అకాడమీ) పుస్తకంల ఉన్న తెలుగు మన తెలుగు ఒక్కటి గాకపోయే.  తెలుగు పుస్తకంల తెలుగు  గూడ ఇంగ్లీష్ లెక్క పరాయిదేశం బాస నే అనిపిస్తది. ఆడదాక ఎందుకు ఇప్పుడు నేను  రాసిన ఈ ఉత్తరం సదువనీకి ఎంత కష్ట పడుతున్నారో గదా! అయితే ఇదే మన అసలైన తెలుగు. పక్కా తెలంగాన బాస. ఈ బాస తెలుగు అకాడమీ తెలుగు పుస్తకంల ఎప్పుడన్న కండ్లవడతదా. మన తెలుగు రాసే  రచయితల సంగతి  చెప్పద్దు.  పోటీలు వడి మరీ గొట్టు గొట్టు మాటలు రాస్తరు.  అందుకే నేమో పోరగాండ్లు తెలుగు అకాడమీ పుస్తకాలు గొనుడే బంజేసిండ్రు.  పరీక్షల ముందు టెస్ట్ పేపర్లో, గైడ్లో కొని, మల్ల    అండ్ల కూడ ఇంపార్టంట్ ప్రశ్నలు ఒక ఐదో పదో బట్టి వెట్టి, పాస్ మార్కుల మందం సదివి పరీక్షలు రాస్తరు.   ఇగ హిందీ బాస సంగతి చెప్పద్దు. ఏ మాటకామాట చెప్పుకోవాల.  హిందీ బాస మనోళ్లకు బాగనే వస్తది. మల్ల అది గుడా మంచి హిందీ గాదు. ఏదో అట్టి తొట్టి హిందీ.  ఇప్పుడు కొత్తగ ఇంగ్లీషు  బాస నేర్చుకోక పోతే కొలువు దొరికె టట్లు లేదు.  గదేందో కొత్తగ  షురూ అయింది గదా ! గదే  సార్లూ ! ప్రపంచీకరణమట. గది జయ్యవట్టి ఇంగ్లీష్ బాస నేర్సుకొనక తప్పదట గదా!   ఇప్పుడు అసలు సంగతి జెప్త  ఇనుండ్రి.  ఇంట్లొక బాస, గల్లీల ఒక బాస,  ఇస్కూల్ల రెండు మూడు బాసలు నేర్చు కొమ్మంటే ఎట్ల ? పోరగండ్ల బతుకంత బాసలు నేర్సుకునేటందుకే సరిపోతే మరి ఆల్లు  సైన్స్, లెక్కలు, చెట్ల, జంతువుల సదువులు   ఎప్పడు నేర్సుకోవాలె.  నేను పదో తర్గతి సదువుతున్నప్పుడు, నా దోస్తులు చానా మంది ఇంగ్లీషుల ఫేలయ్యి సదువులే ఆపేసిండ్రు. సూసిండ్రా బాస కున్న మహత్యం.  ఇప్పుడు ప్రపంచీకరనం పేరుతో అమెరికా పోరడి తో ఇంగ్లండ్ పోరి తో మన పొరగాండ్లు పోటీ పడుమంటే యాడికెల్లి వడ్తరు .  ఈడి టైమంత బాసల  తోని కుస్తీకే సరిపాయె!  బాస బాసకోసమే అయితే బాధ లేదు. ఇంకో పది బాసలు నేర్సుకుంటరు మన పిల్లలు.  మన పోరగాండ్లకు తెలివి మస్తుగున్నది.   ఎంత కష్టమైన చేస్తరు.  కాని  ఆల్ల రక్తమంతా బాసలే తాగితే  ఎట్ల?  బాస తోని  ఇంకోటి నేర్సుకోవాలనాయే.   అయినా మన తెలంగాణా కు భాషకు ఎప్పడూ కయ్యమే మునిగింది.  నిజాం సర్కారోడ ఛ్చి ఉర్దూను జబర్డస్తి  నేర్పించిండు.  తెలుగు సదివినోన్ని జైళ్ల వెట్టిండు. మనను అటుగాకుండా ఇటుగాకుండ నాశనంజేసి మునిగిండు. మా తాతకు తెలుగు రాయడం రాకపోతుండె, సద్వనికి రాక పొతుండే. అలీ, బే, తే అని ఉర్దూల ఉల్టా రాస్తుండె.   అసలు మనకు మాతృ భాషనే  లేకుండా జేసిండు.  ఇప్పుడు జెప్పుండ్రి పది బాసలు నెత్తికెక్కుకుని ఉరికె టోడు పోటీల గెలుస్తడా లేక ఒక బస బరువును మోసేటోడు గెలుస్తాడా? గిట్లయితే మనం ఎప్పుడు ముందుకు వోవాలె . అందుకని సార్లూ ముందు పోరగాండ్లను గీ బాసల లొల్లి నుంచి బైట వడేయిండ్రి. ఈ భాషల పంచాయితీ మనకు మాత్రమే గాదు, అంతో ఇంతో రాయలసీమోళ్ళకు, అటు ఇశాఖపట్నం దిక్కు గూడ ఉన్నదట.  Finally what I am trying to convince at this point in time is that we need to have a serious look at language problem in the context of changing scenario. 

  మీ విమర్శలకై ఎదిరి చూస్తూ 
ప్రదీప్ కుమార్ 
మన తెలంగాణా మన ఆలోచనలు 
9840609959
suvarna.telangana@gmail.com