రాజ్యం - ఆత్మ కథ
రాజ్యం ఆత్మకథ నేపధ్యం
గతంలో అంటే చాలా రోజుల కింద కాదు కాదు కొన్నేళ్ల కింద కళా రూపాలను విద్య కోసం ఎందుకు వాడుకోకూడదు అనే ప్రశ్న వేసాను. పెద్దగా స్పందన రాలేదు. ఏళ్ళు గడిచిపోయినా ఇంకా ఆ ప్రశ్న ఇంకా నన్ను తొలుస్తూనే ఉంది. చివరికి ఆ ప్రయత్నం నానుంచే మొదలు పెడదామని అనిపించింది. ఆ ఆలోచనలలొంచే పుట్టిందే ఈ రాజ్యం ఆత్మకథ. ఇది ఒక రూపం మాత్రమే. ఇదే అంశాన్ని ఇంకా చాలా రకాలుగా చెప్పొచ్చొ ఆలోచించండి. విద్యార్థులను ఒకే రకమైన పాఠం వినే దురదృష్టం నుండి బయట పడేయాలంటే ఇలాంటి అనేక కళా రూపాల్లో అకాడమిక్ టాపిక్స్ ను విస్తృతంగా రచించాలని మేధావులను కోరుతూ - ఇప్పటికి సెలవు. ఇక రాజ్యాన్ని పెర్సానిఫై చేసి ఒక రచయితగా నేను అందులోకి పరకాయ ప్రవేశం చేసాను నా ఈ ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో మీరే చెప్పాలి. - మీ ప్రదీప్
ఇంకో చిన్న రిక్వెస్ట్. చిన్న చిన్న భాషా దోషాలను పెద్దగా పట్టించుకొవద్దని మనవి
నా ప్రియమైన పౌరులారా
మై డియర్ సిటిజన్స్
నేనెవరో గుర్తు పట్టరా? లేదా ! పరవాలేదు. చాలా మందికి నా గురించి తెలియదు. కొద్ది మందికి మాత్రమే నా గురించి తెలుసు . ఇదివరకు నా గురించి పెద్దగా తెలియక పొయినా గడిచిపోయింది. కాని రోజులు మారుతున్నాయి నా స్వరూప స్వభావాలలో ఎన్నో మార్పులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ నాగురించి తప్పనిసరిగా తెల్సుకోవాలి. ఎవరండీ మీరు?! కంటికి కనపడకుండా ఏంటో చెప్తున్నారు? అని అనుకుంటున్నారా? తొందర పడకండి ఒక్కొక్కటిగా అన్నీ వివరిస్తాను…
ముందుగా నేనెలా ఉంటానో చెప్తాను. అవునూ.. నేనెలా ఉంటాను…. ? అసలు నాకు ఒక ఆకారం ఉందా…. ? లేదు! ఎప్పుడైనా ఆకాశంలో మేఘాలను చుశారా? వాటికి ఒక ఆకారం ఉందా? లేదుకదా! అలగే నాకూ ఆకారం లేదు. మబ్బులు తమ షేపులు మార్చినట్లే నా ఆకారం కూడా అప్పుడప్పుడు మారుతుంది. మరి నన్నేలా గుర్తు పట్టడం అంటారా? నో ప్రాబ్లమ్! మీకు రెండు కాళ్ళు, రెందు కళ్ళు, చేతులు ఉన్నట్లే నాకు కుడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. నా లక్షణాలలో మెదటిది అంటే పౌరులు, ఇంగ్లీషులో పీపుల్ అంటారు. అంటే అంటే మీరు. రెండవది మీరు ఉంటున్న భూమి అంటె ప్రదేశం. ఇంగీషులో టెర్రిటరీ అంటారు. మూడవది ప్రభుత్వం. అంటే గవర్నమెంటు. ఇప్పుడు చెప్పండి నేనెవరినో ? ఎంటీ? ! మీ ఊరా ? కాదు ! అవును మీ ఊర్లో ప్రజలున్నారు, మీకు భూమి ఉంది ఇంకా మీ ఉళ్ళో ప్రభుత్వంలాగా పనిచేసే గ్రామ పంచాయితి కూడా ఉంది కాబట్టి నన్ను మీ ఊరు అనుకుంటున్నారేమో ? కాదు. నాకు నాల్గవ లక్షణం కూడా ఉంది. అదే సార్వభౌమాధికారం. మీ ఉరికి ఆ లక్షణం లేదు. అంటే సార్వభౌమాధికారం లేదు అదేంటి అనుకుంటున్నారా ? అవును అదే ముఖ్యమైనది. నాకుండే ఈ అధికారాన్ని, అదే సర్వబౌమదికారాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. నాపైన మరో అధికారం లేదు. నేనే అన్నింటికంటే, అందరికంటే పెద్ద. నువ్వు మా రాష్ట్ర పతి కంటే పెద్డా ? అని అడుగుతున్నారా ? అవును మీ రాష్ట్రపతి కంటే ఇంకా అమెరికా అధ్యక్షుడికంటే కూడా నేనే పెద్ద. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది కదా . డోంట్ వరీ! ఇంకో క్లూ ఇస్తాను. ఒక్క సారి భారతదేశ పటాన్ని గుర్తుకు తెచ్చుకొండి. అవును నాపేరు రాజ్యం ఇప్పుడు నన్ను దేశం అనీ జాతి అనీ రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇంగ్లీషులో నన్ను స్టేట్ అని అంటారు. నేనే అమెరికాని. నేనే భారత దేశాన్ని, నేనే ఆస్ట్రేలియాను, శ్రీలంకను, ఇలా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 195 పేర్లతో నన్ను పిలుస్తారు. ఇక్కడ దాదాపు అన్న మాట ఎందుకు వాడానంటే ఐక్య రాజ్యసమితి లిస్టులో ఈ రోజునాటికి 195 రాజ్యాల పేర్లున్నాయి. అందుకే దాదాపు అన్న మాట వాడాను రేపు ఈ నంబర్ మారొచ్చు. తగ్గచ్చు పెరగొచ్చు. ఓకేనా? సరే ఇప్పటి వరకు చెప్పిన మరొసారి గుర్తు చేస్తాను.
నన్ను రాజ్యం అని పిలుస్తారు. ఇప్పుడు దేశం అనీ, జాతి అనీ రకరకాల పేర్లతో పిసుస్తున్నారు. తెలుగులో రాజ్యం, ఇంగ్లీషులో స్టేట్ నా కామన్ పేర్లు , ప్రాంతాన్ని బట్టి నన్ను వేరే పేర్లతో పిలుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, బంగ్లాదేశ్, చైనా.
నాకు నాలుగు ప్రధాన లక్షణాలున్నాయి
ప్రజలు People
ప్రభుత్వం Government
ప్రదేశం Territory
సార్వభౌమాధికారం Sovereignty
ఇంకా నాగురించి చాలా చెప్పాలి. నా గురించి చాలా చెప్పాలి కానీ ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు ! సరే నా ఆత్మ కథను కూడా సాంప్రదాయ పద్దతిలో క్లాస్ రూం పాఠం లా మొదలు పెడితే మీరు బోరై పోతారు. అసలు విషయం ఇంకా మొదలే కాలేదా! మరి ఇప్పటిదాకా చెప్పుకున్నదేమిటన్న అనుమానం మీకు రావచ్చు. అది కూడా పరిచయమే కానీ మీ తో మాటలు కలపడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. అసలు పరిచయం ఇప్పుడు మొదలు పడతాను
నన్ను రాజ్యం అన్న పేరుతొ పిలుస్తారు. కానీ ఇప్పుడు ఆ పేరుతో నన్నెవరూ పిలవటంలేదు. “దేశం” అని పిలుస్తున్నారు. ఇంగ్లీషు లో స్టేట్ (State) అంటారు. అయితే రాజ్యం లెదా స్టేట్ నా సాధారణ పెరు. అంటే అబ్బాయి, అమ్మాయి మనిషి, ఇవన్నీ కామన్ పేర్లు. ఎలాగంటే మీ క్లాసులో 10 అమ్మాయిలున్నారు అందులో ఫలానా అమ్మాయి పేరు సృజన లేదా మిథిలా, ఇలా పదిమందికి వేరు వేరు పేర్లు ఉంటాయి. అలాగే రాజ్యం నా కామన్ పేరు. అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ , జపాన్, చైనా, ఇండియా ఇలా అనేక పేర్లున్నాయి నాకు. నేడు నేను లేకుండా వ్యక్తి శాంతియుత సామాజిక జీవనం గడపడం అసాధ్యం. అసాంఘిక శక్తుల నుండి దౌర్జన్యాల నుండి, అమాయకులను, బలహీనులను రక్షించేది నా ప్రభుత్వం. విదేశీ దాడులనుండి ప్రజలను కాపాడేది కుడా నా ప్రభుత్వమే. ప్రభుత్వం నా ప్రతినిధి. నాతరఫున ప్రజలను కాపాడుతూ వారికి చక్కటి సామాజిక జీవితాన్ని ప్రసాదిస్తుంది. చట్టాలు తయారు చేసి వాటిని అమలు పరుస్తుంది. మీ దగ్గర పన్నులు వసూలు చేసి ఆ డబ్బులను మీకోసమే ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. నేడు నేను మీ అంటే ప్రజల జీవితాలతొ ఎంతగా కలసి పోయానంటే నేను లేని జీవితాన్ని ఊహించడం కష్టం. అందుకే అరిస్టాటిల్ అంటాడు “రాజ్యంతో పనిలేని వ్యక్తి దేవుడైనా అయి వుండాలి లేదా జంతువైనా కావాలని. భారతదేశం వంటి పేద సంక్షేమ రాజ్యాలలో నేను పేదలకు ఎన్నో రకాల సహాయం అందిస్తాను. అందరూ ఏదో రకంగా నా నుంచి సహాయం పొందుతున్న వారే. అయితే నన్ను చెడుగా చూసే వారు కూడా ఉన్నారు. అరాచక వాదులకు అంటే అనార్కిస్టులకు నేనంటే ఇష్టం లెదు. అలాగే వ్యక్తిశ్రెయొవాదులు నా జోక్యాన్ని ఎక్కువగా సహించరు. వారి దృష్టిలో నేను అవసరమైన లేక తప్పనిసరిగా ఉండవలసిన చెడును. (State is an inevitable evil) వ్యక్తి శ్రేయో వాదులు లేసాపేర్ అన్న మాటను అప్పుడప్పుడు వాడుతుంటారు. ఇంకా ఏమంటారంటే That government is the best government which governs least. అంటారు. కార్ల్ మార్క్స్ ఏకంగా నేను నాశనమై పోవాలని శపించాడు. ప్రపంచీకరణం, సరళీ కృత ఆర్ధిక విధానల ఫలితంగా నా స్వరూప స్వభావాలలో మార్పులు వస్తున్నాయి. రాజ్యాల బోర్డర్లు ఇక ఇలా ఉండక పోవచ్చు. ఒకవైపు కోవిడ్ అదేనండి కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టెసి చావు మేళం జోరుగా వాయిస్తున్నఈ సమయంలో కొన్ని దేశాలు సరిహద్దుల వివాదాలు మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు గర్జిస్తున్న ఈ సంకట తరుణంలో నా పరిచయం గురించి ఇంకా చాలా చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతాను.
నా పేరు లోని మతలబు
ఇంతకు ముందే చెప్పానుగా తెలుగులో నన్ను ‘రాజ్యం’ అంటారని. ఐతే ఒక్క విషయం. రాజ్యం అనే పేరు నా సాధారణ (కామన్) పేరు. ఒక ఉమ్మడి పేరు కూడా. దాదాపు 200 వందల నా లాంటి సోదర రాజ్యాల తరపున నేను ఈ ఆత్మ కథను మీ ముందుంచుతున్నానని అర్ధం చేసుకోవాలి. ఈ రోజుల్లొ రాజ్యం అన్న పదాన్ని ఎవ్వరూ వాడడం లేదు ఇప్పుడు నన్ను దేశం, అనీ జాతి పిలుస్తున్నారు రాజనీతి శాస్త్రవేత్తలు, ఇతర సమాజ శాస్త్ర వేత్త్తలు తమ పుస్తకాలలో, వ్వాసాలలో, ఉపన్యాసాలలో ఇంకా నన్ను రాజ్యమనే సంభోదిస్తారు. హిందీలొ నన్ను రాష్ట్రమని పిలుస్తారట. ఇక ఇంగ్లీషులో నన్ను స్టేట్ అంటారని కూడా చెప్పాను కదా! కొంత మంది వ్యుత్పత్తి శాస్త్ర వేత్తలు అంటే ఎటిమాలజిస్టులు నా పేరు వెనక ఉన్న చరిత్ర గురంచి ఎం చెబుతున్నారో తెలుసుకుందాం. state (స్టేట్) అనే ఇంగ్లీష్ పదానికి మూలం స్టేటస్ ( STATUS) అనే పదం ఒకటి ఉందట. ఈ స్టేటస్ అన్న పదం ట్య్టుటానిక్ భాష నుండి వచ్చిందంటున్నారు. స్టేట్ అన్న పదాన్ని మాఖీయవెల్లి అనే రచయిత మొదటి సారిగా ‘ప్రిన్స్’ అన్న పుస్తకంలో వాడినట్లు చెపుతారు. ఈయన ఇటలీ దేశస్థుడట. అదండి, నా పేరు వెనక ఉన్న సంక్షిప్త చరిత్ర.
నా నిర్వచనాలు
కొంతమంది శాస్త్రవేత్తలు నన్ను అంటే రాజ్యాన్ని నిర్వచించే ప్రయత్నం చేసారు. అందులొ కొన్నింటిని చూద్దాం. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. ఏ నిర్వచనం కూడా నా గురంచి పూర్తిగా చెప్పదు. ముందుగా అరిస్టాటిల్ నిర్వచనాన్ని పరిశీలిద్దాం. ఆయనెవరా? అబ్బో! చాలా గొప్ప వ్యక్తి . రాజనీతి శాస్త్ర పితామహుడు. క్రీస్తు పూర్వం నాటి వ్యక్తి. మన దేశం మీదకు దండెత్తిన గ్రీకు రాజు అలగ్జాండరుకు గురువు.
ఈయనే అరిస్టాటిల్. ఈయన నన్ను ఇలా నిర్వచించాడు “మానవుని ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అవతరించి అతనికి ఉత్తమ జీవితం ప్రసాదించేదే రాజ్యం” చూసారా? నా గురించి అరిస్టాటిల్ ఎంత బాగా చెప్పాడొ? నేను మానవుని అవసరాలు తీర్చడానికి పుట్టానట. ఇంకా చక్కటి జీవితం ప్రసాదిస్తానట. థాంక్యూ అరిస్టాటిల్! నన్ను పాజిటివ్ గా నిర్వచించినందుకు. ఇప్పుడు మరొకటి చూద్దాం.
ఉడ్రోవిల్సన్ నిర్వచనాన్ని గమనిద్దాం
ఈయన కూడా చాలాగొప్ప వ్యక్తి. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు. ప్రభుత్వ పాలన శాస్త పితామహుడు. నానా జాతి సమితి స్థాపకులలో ఒకడు. గొప్ప తాత్వికుడు. ఈయన ప్రకారం రాజ్యం “ఒక నిర్ణీత భూభాగంలో శాసన బద్ధమైన ప్రభుత్వం ఉన్న పౌర సముదాయము” విల్సన్ నిర్వచనంలో ప్రదేశం, ప్రజలు, ప్రభుత్వం, శాసన బద్ధత అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈయన నిర్వచనం రాజ్య లక్షణాలను గుర్తు చేస్తుందని మీకు తర్వాత తెలుస్తుంది .
అయితే డేవిడ్ ఈస్టన్, రాబర్ట్ ధాల్, గాబ్రియల్, ఆల్మండ్ వంటి రచయితలు నన్నొక రాజకీయ వ్యవస్థ గా పెర్కొన్నారు. ఇంకా వివరాలు కావాలంటే తెలుగు అకాడమి పుస్తకం చదవండి.
నా పుట్టుక
ఇప్పుడు కాసేపు నా పుట్టుక ముచ్చట చెప్తాను. అసలు నా పుట్టుక ఒక పెద్ద మిస్టరీ. ఎప్పుడు పుట్టానో నాకే తెలియదు. నాకు డేట్ అఫ్ బర్త్ లెదు. మీరు అనుకుంటున్నట్లు నేను ఒకే ఎంటిటీని (?) కాను. నా సోదరులు చాలా మంది ఉన్నారు. ఒక్క సారి ఐక్య రాజ్య సమితి సభ్యత్వ జాబితా చూడండి. సుమారు 195 దేశాలు అంటే రాజ్యాలు అంటే నాలాంటి వాళ్ళు ఉన్నారన్న మాట. ఈ సంఖ్య కూడా ఖచ్చితమైంది కాదు. ఇందులో ఎవరు ఎప్పుడు పుట్టారో చెప్పడం కష్టం. అందుకే చెప్పాను నాకు డేట్ అఫ్ బర్త్ లేదు. నాలాంటి రాజ్యాలకు చాలా వాటికి పుట్టిన రోజులు లెవు. అయితే కొంత మంది శాస్త్ర వేత్తలు నా జన్మ రహస్యాన్ని గురించి కొన్ని ఊహా గానాలు చెసారు. వాటిలో కొన్ని చెప్తాను.
దైవ దత్త సిద్దాంతం అంటే డివైన్ ఆరిజిన్ థియరీ ప్రకారం దేవుడే నన్ను సృష్టిం చాడు. ఈ దైవదత్త సిద్దాంతాన్ని చాలా మంది నమ్ముతారు. మన పురాణాలలో కూడా ఇదే రకమైన కథ ఒకటి ఉంది. ఒకప్పుడు భూమి మీద అరాచకం ప్రబలిపోయి అంతా అల్లకల్లొలంగా ఉండేదట. ఆ బాధలు భరించలేక కొంత మంది దేవుడి దగ్గరికి వెళ్లి తమ కష్టాలు చెప్పుకున్నారు. అప్పుడు దేవుడు “మను” అనే వ్యక్తిని భూమి మీదకు పంపాడట. అతనే నన్ను సృష్టించాడనే వాదన ఒకటి ఉంది. రాజు దైవాంశ సంభూతుడనే నమ్మకం ఒకప్పుడు బలంగా ఉండేది. ఇప్పటికీ కొన్ని మత తత్వ రాజ్యాలున్నాయి. ఉదాహరణకు. ఇస్లామిక్ రాజ్యాలు. వెటకన్ సిటీ లాంటివి. ఇవి రాజ్యాన్ని అంటే నన్ను దేవుడే సృష్టించాడని ఇప్పటికి నమ్ముతాయి. ప్రజలు, మత సూత్రాలనే ప్రభుత్వ శాసనాలుగా నమ్మి పాటిస్తారు . ఇలాంటి రాజ్యాలలో మతాన్ని కాపాడటమే నా ఏకైక లక్ష్యం. అయితే ఈ సిద్దాంతం నమ్మడానికి లేదని చాలామంది శాస్త్ర వేత్తలు విమర్శించారు. దైవత్వభావననే నమ్మని నాస్తికులు నన్ను దేవుడు సృష్టించాడంటే అస్సలు నమ్మశక్యం గా లేదని వారి వాదన. నానాటికి సెక్యులరిజానికి ఆదరణ పెరుగుతున్నప్పటికీ మతం నా వ్యవహారాలలో ఇంకా జోక్యం చేసుకుంటున్నది. మతానికి నాకూ మధ్య యుద్ధం నేటిది కాదు.కొన్ని వేల సంవత్సరాలుగా నాకు మతానికి మధ్య తగాదా నడుస్తూనే ఉంది. అంతెందుకు ప్రస్తుతం కోరోనా మహమ్మారి మనుషుల్ని అప్పడాల్లా నమిలేస్తున్నదన్న సంగతి మనందరికీ తెలుసు. ప్రభుత్వాలు పండగలు ఇళ్ళల్లో చేసుకొమ్మంటే ఎవడైనా వింటున్నాడా? పైగా మా మతస్వేచ్చకు ప్రభుత్వం భంగం కలిగిస్తున్నదని కోర్టులకు వెళ్లి పిటీషన్లు వేస్తున్నారు. బై ద వే సందర్భం వచ్చింది కాబట్టి చెపుతున్నాను నేను ప్రభుత్వం ఒకటి కాదు. ప్రభుత్వం దాని మూడు బ్రాంచీలు అంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలు నా తరఫున పనిచేసే నా సేవకులు మాత్రమే. చాలా సార్లు నా అసిస్టెంట్ శాసన శాఖ చేసిన శాసనాలకు పోటీగా కుల మత సంఘాల కట్టుబాట్లు ముందుకు వస్తాయి. అప్పుడు నాకూ మాతానికి దాదాపు యుద్ధమే జరుగుతుంది. అయినా మా లడాయి ఇప్పట్లో తెగేది కాదు. సైన్సు ఇంకా అభివృద్ధి చెంది అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలిగిన నాడు మతం తప్పక మాయమవుతుందని నా నమ్మకం. మతానికి నా రక్షణ మాత్రమే అవసరం కాని నా పోషణ అవసరం లేదని సెక్యులరిస్టుల వాదన. లౌకిక రాజ్యానికి మతం ఉండదు. అగస్టీన్, ఆక్వినాస్ వంటి శాస్త్ర వేత్తలు ఈ సిద్ధాంతాన్ని అంటే దైవదత్త సిద్ధాంతాన్ని నమ్మిన వారిలొ ఉన్నారు. వాళ్లెవరు అంటారా? నేను ఇన్ని విషయాలు మీతో ముచ్చటిస్తున్నానంటే అలాంటి శాస్త్ర వేత్త లే కారణం. నన్ను సృష్టించింది ఎవరో నాకు తెలియదు కానీ నా గురంచి బాగా తెలిసినవారు మాత్రం శాస్త్రవేత్తలే.
ఇందులో నేను అంటే రచయితగా చెప్పిన అభిప్రాయాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తుందని అనుకుంటున్నాను. దయచేసి ఈ పోస్ట్ ను ఫేస్ బుక్కర్లు /నెటిజన్లు సీరియస్ గా చదవమని మనవి. ఎందుకంటే ఇక ముందు జరగ బోయే చర్చ కు ఇది ప్రధాన భూమిక అవుతుంది. ఈ రాజ్యం ఆత్మ కథని ఎంత మందికి వీలయితే అంత మందికి షేర్ చేయండి. ఈ అంశంపై చర్చ జరగడమే నాకు కావలసింది
బల ప్రయోగం ద్వారా రాజ్యాధికారం పుట్టిందని కొందరి అభిప్రాయం. బల హీనులను బలవంతులు లొంగదీసుకునే క్రమంలో రాజ్యం అంటే నేను జన్మించానని ఈ సిద్ధాంత సారాశం యుద్దమే రాజ్యానికి మూలమని ఒక సామెత ఉంది. రాజ్యం వీర భోజ్యమని మహాభారతంలో భీముడు అంటాడు. బలమున్నోడిదే రాజ్యమనే నానుడిని మీరు వినే ఉంటారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే గుండాలదే రాజ్యం. హెర్బర్ట్ స్పెన్సర్, హ్యూమ్, జెంక్స్ వంటి రచయితలు ఈ సిద్దాంతాన్ని ప్రతిపాదించిన వారు. నక్సలైట్లు “ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం” వస్తుందని ఇప్పటికీ నమ్ముతారు. ఇస్లామిక్ స్టేట్ కోసం కొంత మంది చేసే ప్రయత్నం కుడా దండనాధికార సిద్ధాంత కోవలోకే వస్తుంది. అన్నట్టు దండనాధికార సిద్ధాంతాన్ని ఇంగ్లీషులో ఫోర్స్ థియరీ అనీ, కోయర్సివ్ థియరీ పిలుస్తారు. ఈనాటికి రాజ్యానికి సమాంతరంగా, నిరంతరంగా నేర సామ్రాజ్యం కొనసాగుతున్నది. కొన్ని సందర్బాలలో నేను ఇంత బలవంతుడనైనా, పొలీసు, మిలటరీ, న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ నేర కూటములతొ జరిగే పోరాటంలో ఓడిపోతున్నాను. నేను మీ నుంచి పన్నులు అంటే టాక్సులు వసూలు చేస్తే నేర సమాజాలు “మామూళ్ళు” వసూలు చెస్తాయి. నాకు ఒక పద్దతి ఉంది. ప్రజల ఆమోదం ఉంది. కానీ నేర సమాజానికి అవేమీ ఉండవు. షోలే అనే హిందీ సినిమాను మీరు చూసారా? అందులొ గబ్బర్ సింగ్ అనే విలన్ ఉంటాడు. పెద్ద గుండా. ఆయన ఒక డైలాగ్ కొడతాడు “ మిమ్మల్ని (ప్రజలను) నానుంచి రక్షించ గలవాడిని నేనే. కాబట్టి మీ పండించిన పంటలో కొంత నాకు ఇవ్వాల్సిందే” అంటాడు. కోర్టుల్లో అంటే న్యాయ స్థానాల్లో పరిష్కారం కాని అనేక సమస్యలు గుండాలు సెటిల్ చేస్తారు. కొన్ని ప్రాంతాలలొ నేను కల్పించలేని రక్షణను ప్రైవేటు గుండాలు కల్పిస్తారు. అక్కడ వాళ్ళ మాటే శాసనం. ప్రజలు వారికి తమ సంపాదనలో కొంత సంతోషంగా సమర్పించుకొంటారు. మరి దానికి పన్నుకు తేడా ఏముందండీ?
ఇది మరో రకమైన సిద్దాంతం. ఇంగ్లీషు లో సోషల్ కాంట్రాక్ట్ థియరీ అంటారు. రూసో, థామస్ హాబ్స్, హ్యూగో గ్రోషియస్ వంటి శాస్త్ర వేత్తల ప్రకారం సమాజంలోని వ్యక్తులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒప్పందం ఫలితంగా నేను పుట్టినట్లు చెపుతారు. ఒకానొక సమయంలో కొంత మంది పెద్దమనుషులు కలిసి ఒక అధికార పూరిత వ్యవస్థ ను తయారుచేసుకున్నారని వారి అభిప్రాయం. వ్యక్తులు తమ హక్కులను కొన్నింటిని త్యాగం చేసి వాటికి బదులుగా ఒక క్రమబద్ధమైన జీవితాన్ని, రక్షణను కొరుకుంటూ ఒక ఒప్పందాన్ని(కాంట్రాక్ట్) కుదుర్చుకున్నారని సామాజిక ఒప్పంద వాదులు నమ్ముతారు. అలాంటి ఒప్పందం కారణంగా నేను జన్మించి నట్లు చెపుతారు ఈ సిద్దాంతం కూడా విమర్శకు గురైంది. ముఖ్యంగా ఒప్పంద సిద్ధాంతానికి చారిత్రిక ఆధారాలు లేవని విమర్శకుల అలక. కానీ ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా కొట్టి పారెయలేము. ఆచారాలు సంప్రదాయాలు శాసనాలకు మూలాలు. నేటికి ప్రపంచ వ్యాప్తంగా మారు మూల గ్రామాలలో నా ప్రభుత్వ శాసనాలకంటే అచార సాంప్రదాయాలే బలంగా ఉంటాయి. చదువు సంధ్యలు లేని గ్రామస్థులకు రాజ్యాంగాల గురంచి, శాసన సభల గురంచి తెలియవు. కానీ ఊరి ఆచారాలు, కుల కట్టుబాట్లే వారికి చట్టాలు, శాసనాలు. నేటికి కూడా కొన్ని సమాజాలలో కుల మత కట్టుబాట్లు పార్లమెంటు, అసెంబ్లీ, ఇంకా గట్ట్టిగా మాట్లాడితే రాజ్యాంగాన్నికూడా ధిక్కరించేలా ఉంటాయి. సతీ సహగమనం దురాచారాన్ని రూపుమాపడానికి ఆనాడు వలస వాద ప్రభుత్వానికి తోడు రాజారాం మోహన్ రాయ్ లాంటి సంఘ సేవకుల కృషి కూడా తోడైతే తప్ప దాన్ని ఆరికట్టలేక పోయాం. నేటికి కూడా వరకట్న నిషేధ చట్టం అంటూ ఒకటి ఉన్నా దాన్ని పూర్తిగా అమలు చేయలేక పోతున్నాయి నా ప్రభుత్వాలు. ఈ సందర్బంగా నాకొక సంఘటన జ్ఞాపకం వస్తున్నది. కొన్నేళ్ళ కింద ఒక ఊళ్ళో ఎదో పండగ సందర్భంగా మొత్తం ఊరు ఊరంతా సామూహిక పంక్తి భోజనాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామ మాల మాదిగలను తమ పక్కన కూర్చుని భోజనం చేయడానికి ఆ ఊరి మిగతా కులస్తులు ఒప్పుకోలేదు ఈ విషయం అధికారుల ద్రుష్టికి వెళ్ళినా ఏమీ చేయలేక పోయారు. అంటరాని వ్యవస్థ వ్యతిరేక చట్టం అక్కడ చేష్టలుడిగి అచేతనంగా ఉండిపోయింది. రాజ్యాంగం, పోలీస్ వ్యవస్థ వారిని ఏమీ చేయ లేక పోయింది. అమలు ఆచార సంప్రదాయాలు ఆయా సమాజాల ఒప్పందాలే. కాబట్టి నా పుట్టుక తాలూకు రహస్యం సామాజిక ఒడంబడిక లో కూడా కొంత ఉంటే ఉండొచ్చు.
కార్ల్ విట్ ఫోగల్ అనే పెద్ద మనిషి నీళ్ల సిద్ధంతాన్ని ముందుకు తెచ్చాడు. ఆయన ప్రకారం మొదట్లో మనుషులు నొమాడిక్ అంటే సంచార జీవులుగా బతికే వారట. అంటె ఇల్లు, వాకిలి ఊరు, వాడ ఇలాంటివి ఏవీ ఉండేవి కావు. బహుశా కుటుంబ వ్యవస్థ కూడా ఉండేది కాదేమో. జంతువులను వేటాడి, కాయలు దుంపలు ఏది దొరికితే అది తినే వారు . ఆ తర్వాత వ్యవసాయం మొదలయిందట. అప్పుడు మనుషులు సంచార జీవనం మానేసి ఒక చోట స్థిర నివాసం ఏర్పరుచుకున్నార ని చెప్తాడు. అలా చిన్న చిన్న ఊర్లు ఏర్పడి అవి కాస్తా పెద్దవయి పట్టణాలు, రాజ్యాలు గా మారాయని అంటాడు విట్ ఫోగల్. వ్యవసాయానికి కావలసింది నీళ్లు కాబట్టి నా పుట్టుకకు కారణం వాటరంటాడు విట్ ఫోగల్. ఇంగ్లీషులో నీళ్ల సిద్ధాంతాన్ని హైడ్రాలిక్ థియరీ గా పేర్కొంటారు. అవునండోయ్! ఈ సిద్దాంతంలో ఎక్కడో కొంత నిజం కనపడుతున్నది సుమా! పెద్ద పెద్ద పట్టణాలు, చాల దేశాల, రాష్ట్రాల రాజధానులు ఏదో ఒక నది పక్కన ఉన్నాయి కదా! ఉదాహరణకు లండన్ థేమ్స్ నది పక్కన ఉంది. హైదరాబాద్ మూసీ నదికి అటూ ఇటూ ఉంది. ఇంకా కావాలంటే ఇక్కడ్ ఇచ్చిన లింకును క్లిక్ చేయండి, మీకే తెలుస్తుంది. అంటే నాగరికత నదుల నుంచే ప్రారంభమయ్యిందన్న మాట. ఈనాటికీ నా ప్రభుత్వాలు ప్రజలకు నీటి వసతిని కల్పిస్తున్నాయి. నీటిని ప్రజలకు అందుబాటులో ఉంచడం నా బాధ్యత. హిమాలయాలను కరిగించైనా, అరేబియా సముద్రాన్ని మరిగించైనా జననానికి జలాలు ఇవ్వాల్సిందే! అయినా ఈ సిద్ధాంతం కూడా పూర్తిగా వాస్తవం కాదని కొందరు విమర్శించారు. విట ఫోగల్ చివరగా వాటర్ థియరీ ఇక్కడ నేను చెప్పినంత సరళంగా ఉండదు కానీ నేనే దాన్ని సింప్లిఫై చేసాను. ఎవరైనా ఈ విషయాన్నీ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి లేదా ఈ వెబ్ సైట్ ను చూడండి https://www.jstor.org/stable/3630459?seq=1
ఇంతవరకు చెప్పుకున్న సిద్దాంతాలన్నీ నాకు ఖచ్చితమైన పుట్టిన తేది, తిథి, వార నక్షత్రాలు లేక పోవడం వల్ల వచ్చిన హైపొథీసీసులు తప్ప ఎ ఒక్కటీ పూర్తిగా నిజం కాదు. 1947 లో ఏర్పడిన పాకిస్తాన్, ఇజ్రాయిల్ మతం, సోషల్ కాంట్రాక్ట్ , ఇంకా బలప్రయోగ సిద్దాంతాల కలయికగా పేర్కొన వచ్చా?! ఏమో కావచ్చు! Else it is not real birth of a state but mere transfer of political power. ఇక భవిష్యత్తులో ఇస్లామిక్ రాజ్యం ఏర్పడితే మతం, బలప్రయోగం, దైవ దత్త అధికార వ్యవస్థ, సామాజిక ఒడం బడిక అన్నీ అందులొ కనపడతాయి కావచ్చు. సరే చివరగా చెప్పుకొవలసిందేమిటంటే నాకు జన్మ తేదీ లేదు. మీకులాగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకునే అదృష్టం లెదు.
నా మట్టుకు నాకు ఏమనిపిస్తుందంటే మనుషులు పుట్టకముందే రాజ్యం అంటే నేను, పుట్టాననిపిస్తుంది . అదెలాగంటే డార్విన్ చెప్పిన జీవ పరిణామ సిద్ధంతాన్ని మీరు నమ్మితే, మనిషి మనిషిగా మారక ముందు కోతి గా ఉండేవాడని తెలుసుగదా?. కాబట్టి అన్ని జంతువులు మీ కంటే ముందే పుట్టి ఉంటాయి గదా?. ఆ లెక్కన చీమలు, తేనెటీగలు మనుషుల కంటే ముందు పుట్టి ఉంటాయి కదా? మరి అవి చక్కటి శాసన బద్ధ మైన జీవితాన్నిఈ నాటికి కలిగి ఉన్నాయి. భారత దేశంలో, ఆఫ్రికా ఖండంలోని వందల గ్రామాలు రాజ్యం, దాని ఉనికి తాలూకు స్పర్శ లేకుండా శాంతి యుత జీవితాన్ని గడుపుతున్నాయి. చీమలకు రాణి చీమ ఉంటుందట. అది చెప్పిన మాట మిగతా చీమలు వింటాయట. ఆప్టరాల్ స్టేట్ మీన్స్ ఎ సిస్టమాటిక్ లైఫ్. రాజ్యం అంటే ఒక క్రమ బద్ధ జీవితమే అనుకుంటే మనిషి పుట్టకముందే క్రమ బద్ధ మైన సామాజిక జీవనం ఉండేది. కాబట్టి మనిషి కంటే ముందే రాజ్యం అంటె నేను పుట్టాను. ఆ నాటి రాజ్యానికి నేటి సమాజానికి పోలికలు మొత్తంగా లేక పోవచ్చు. సో మై డియర్ సిటిజన్స్, నా పుట్టుక ఇప్పటికీ, బహుశా ఎప్పటికీ ఒక మిస్టరీయే!
ఈ సందర్భంగా రీడర్స్ కు నా విన్నపం. ఎలాగూ నా జన్మ రహస్యాన్ని ఛేదించడం సాధ్యంగాదు. ఇప్పుడు అటాప్సీ అదేనండీ పోస్టుమార్టమ్ , శవ పరీక్ష బదులు బయాప్సీ చేస్తే ఎలా ఉంటుందో ఆలొచించండి “ పన్ను” అంటే Tax పుట్టినపుడే నేను పుట్టానని నా అభిప్రాయం. నాకు పన్ను కు చాలా దగ్గర సంబంధముంది. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన అన్ని రకాల హైపోథిటికల్ సిద్ధాంతాలలో పన్ను ప్రస్థావన కనిపించదు కనిపించినా దాన్ని సీరియస్ గా అధ్యయనం చేసిన దాఖలాలు లేవు . కానీ పన్ను అంటే Tax లేకుండా ఏ రాజ్యం మన లెదు. బలవంతంగా ఒక లెక్కా పత్రం లేకుండా వసూలు చేసేది “ మామూలు”. అదే న్యాయ బద్దంగా వసూలు చేస్తే పన్ను అవుతుంది. ఈ నాటికి కొన్ని రకాల వసూళ్ళు న్యాయ బద్ధత లేకుండా జబర్దస్తీగా కొనసాగుతున్నాయి. మామూళ్లు ఎప్పుడు పన్ను రూపం అంటే లేజిటిమైజ్ అయిందో ఆ రోజే నా డేట్ అఫ్ బర్త్. కాని మామూలు ఎప్పుడు న్యాయ బద్దత పొందిందో చెప్పడం కష్టం. కాబట్టి పన్నును సెంట్రల్ పాయింట్ గా ఊహించుకొని Pre Tax State, Post Tax State గా నన్ను విశ్లేషి స్తే నా పుట్టుక రహస్యాన్ని కొంత వరకైనా చేధించ వచ్చు. పైగా ఇప్పటికీ నేరాలు, అవినీతి ఎక్కువగా ఉండి డబ్బుల రాక పోకల తీరును బట్టి ఏయే రాజ్యాలు ప్రీ టాక్స్ దశలో ఉన్నాయో ఏవి పోస్ట్ టాక్స్ దశలో ఉన్నాయో చెప్పొచ్చు. అంటే ఫలానా రాజ్యంలో డబ్బులు లీగల్ గా కంటే ఇల్లీగల్ గా చలామణి ఎక్కువగా ఉందంటే అది ప్రీ టాక్స్ రాజ్యం అనుకోవాలి బ్లాక్ మనీ తగ్గి వైట్ మనీ పెరిగితే అది పోస్ట్ టాక్స్ స్టేట్గా భావించాలి. ఇది ఖచ్చింతగా నా అభిప్రాయం మాత్రమే. దీనిపై వాదోపవాదాలు విమర్శ ప్రతి విమర్శలు జరుగుతాయని నాకు తెలుసు. నాకు కావలిసింది కూడా అదే. ఇక ఇప్పటికి నా పుట్టుక సోది ఆపేసి కాస్త ముందుకెళ్ళే పనిలో పడదాం.
ఇప్పుడు నా లక్షణాల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా నాకు నాలుగు ముఖ్య లక్షణాలున్నాయని ఇంతకుముందే చెప్పాను కదండీ! జ్ఞాపకం లేదా?! సర్లెండి! నేను చెప్పడం మీరు మర్చిపోవడం… ఎప్పుడూ ఉండేదే కదా? మళ్లీ చెప్తాను. తప్పుతుందా! నాకు నాలుగు ముఖ్య లక్షణాలున్నాయి. అవి
ప్రజలు People
ప్రదేశం Territory
ప్రభుత్వం Government
సార్వభౌమాధికారం Sovereignty
ఇప్పుడు ఒక్కొక్క లక్షణం గురించి కొంచం వివరంగా తెల్సుకుందాం.
ప్రజలు
ప్రజల గురించి ఏముంటుంది తెలుసుకోవడానికి అనుకుంటున్నారా? అబ్బో ! చాలానే ఉంది.
దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్ అన్నాడో మహాకవి. ఆయన పేరూ…. గుర్తుకొచ్చింది. గురజాడ గారు. ఆయనెవరా? ఆయనే నండి.. కన్యా శుల్కం. ముత్యాలసరాలు వంటి కావ్యాలను సృష్టించిన గొప్ప కవి. ఆయన గురించి ఇంకా తెల్సుకొవాలంటె, మీరు నా ఈ ఆత్మ కథను ఆన్ లైన్లో చదువుతున్నట్లయితే, ఇక్కడ క్లిక్ చేయండి. కాబట్టి మై డియర్ పౌరులారా! రాజ్యం అంటే మీరే. అంటే ప్రజలే. అయితే ఎంత మంది (ప్రజలు) ఉండాలి? ఏదైనా ఖచ్చితమైన సంఖ్య ఉందా అంటే లేదనే చెప్పాలి. వందల్లో, వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో లేదా చైనా, ఇండియా లలో లాగా 100 కోట్ల కు మించి ఉండొచ్చు. వాటికన్ సిటీ (ఇది కూడా ఒక రాజ్యమే) జనాభా 900 లోపు మాత్రమే. ఎంత మంది ఉన్నారన్నది మ్యాటర్ కాదు. ఎంత మంచి వారు, ఎంత గొప్ప పనిమంతులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, నీతిమంతులు ఉన్నారన్నది పాయింట్. దోపిడీలతొ, మోసాలతో, వంచనలతో, అనారోగ్యాలతొ, చేతగాని సోమరిపోతులుగా ఉండే కోట్ల జనాభా కంటే తక్కువ ఉన్నప్పటికీ మంచి వారుంటే చాలు. దేశమంటే మట్టి కాదోయ్ … దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ వారే, ఈసురో మని దేశ ప్రజలుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని కూడా అన్నాడు. మహానుభావుడు మరణించి వందేళ్లయినా(1915) ఇప్పటికీ జనం మనసుల్లో బతికే వున్నడు. శ్రీ శ్రీ అన్నట్లు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. అలా కాకుండా పావన నవ యవ్వన యువకులు, ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనే వారు మనకు కావాలి. సో ఎంత మంది అంటే .. నో స్పెసిఫిక్ స్కేల్. నో ఫిక్స్డ్ నంబర్. మీకు రాజ్యాలు, వాటి జనాభా లెక్కలు కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు జనాభా సంఖ్యలను సూచించారు. ప్లాటో 5040 మంది ని ఒక ఆదర్శ రాజ్య జనాభా గా పేర్కొంటాడు. అలాగే రూసో 10,000 జనాభా ఉంటే సరిపొతుందన్నాడు. వాళ్ల కాలం నాటికి ఆ లెక్కలు సరిపోయాయేమో గానీ ఇప్పుడు అలా ఖచ్చితమైన సంఖ్య సూచించడం వీలుకాదు. ఒకప్పుడు భారత దేశ పేదరికానికి అధిక జనాభా కారణమన్నారు. కానీ నేడు ఆ అధిక జనాభా నే మనకు వరంగా మారింది. కానీ నిరక్షరాస్యులు, బద్దకస్తులు, ఎలాంటి స్కిల్స్ లేని వారు ఉన్నా లేకపోయినా ఒకటే. దీన్ని బట్టి మనకు అర్ధమౌతున్నదేమిటంటే జనాభా కు ఖచ్చితమైన సంఖ్య లేక పోవడం మాత్రమె కాదు. జనాభా సంఖ్యలో హెచ్చు తగ్గులు కూడా ఉంటాయని. అదండీ ప్రజల గురించిన వివరణ ! మరి రెండో లక్షణానికి షిఫ్ట్ అవుదామా?
ప్రదేశం
“నా జన్మ భూమి ఎంతో అందమైన ప్రదేశం” అని ఎవరో ఒక కవి రాస్తే ఒక గాయకుడు బహుశా ఘంటసాల గారనుకుంటాను దాన్ని చక్కగా రాగయుక్తంగా ఆలపించాడు. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్న పద్యం వింటే ఒళ్లు పులకరించి పోతుంది. దేశమంటే మట్టికాదోయ్ అని గురజాడ అప్పారావు గారు అన్నారు గాని రాజ్యమంటే మట్టి కూడా. పంటలు పండాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, చివరికి మనం నిలబడాలన్నా భూమి కావలసిందే కదా? మనిషి గాలిలో బతక లేడు, నీళ్లపై నిలపడలేడు గదా? అందుకని నా రెండో లక్షణం ప్రదేశం లేదా భూమి. ఇంగ్లీషు లో అయితే దీన్నే ప్లేస్ అని టెర్రిటరీ పిలుస్తారు. అయితే ఎంత జాగా అవసరము? ఈ ప్రశ్నకు జవాబు కూడా -‘నో లిమిట్’. కనిష్ట, గరిష్ట పరిమితులు లేవు. అతి చిన్న దేశాలున్నాయి అతి పెద్ద దేశాలున్నాయి ప్రపంచంలొ అతి పెద్ద రాజ్యం రష్యా- 1,70,75,200 చదరపు కిలో మీటర్లు. వాటికన్ నగరం కేవలం 0.44 చదరపు కిలో మీటర్(ఒక చదరపు కిలోమీటరు కంటే తక్కువ) మాత్రమే. వైశాల్యం లో భారత దేశం 7 వ స్థానంలో ఉంది. రాజ్యం తన ప్రజల అవసరాలను తీరుస్తూ వారికి సుఖ సంతొషాలను పంచి ఇవ్వాలి. అప్పుడే నన్ను అందరూ మెచ్చు కుంటారు. ఉత్తర దక్షిణ ధృవాలలో నేను ఉండ లేను. ఎందు కంటే మీరు ఉండ లేరు కాబట్టి. ప్రదేశాల కోసమే జనం కొట్టుకు చస్తున్నారు. చరిత్ర లో జరిగిన అనేక యుద్ధాలు భూమి కోసమే కదా! అయితే ఒక రాజ్యం పైన ఉండే ఆకాశం సంగతేంటి? ఆ ఆకాశమంతా ఆ రాజ్యానిదే. దీన్నే ప్రాదేశిక వియత్తలం అంటారు. ఇంగ్లీషు లో అయితే టెర్రిటొరియల్ స్పేస్ అంటారండి. అలాగే ఒక రాజ్యం సముద్రాన్ని అనుకుని ఉంటే, మరి ఆ సముద్ర జలాలు ఎంతవరకు ఆ రాజ్యానికి చెందుతాయంటే.. 200 నాటికల్ మైళ్ల వరకు. ప్రదేశం సైజును బట్టి నా అంతర్గత అరేంజ్మ్ంట్ లో కొన్ని మార్పులుంటాయి. చిన్న చిన్న రాజ్యాలకు ఏకకేంద్ర తరహా ప్రభుత్వాలుంటాయి. పెద్ద సైజు రాజ్యాలకు సమాఖ్య లక్షణాలుగల ప్రభుత్వాలు వుంటాయి ముందు ముందు ప్రదేశం ఇంకా అనేక సమస్యలు తెచ్చి పెడుతుందని నా భయం. జనాభా పెరుగుతున్నది. కానీ భూమి పెరగదు. ప్రజలకు కూడు, గూడు లేక పొతే మళ్లీ మొదటి రోజులు వస్తాయేమో. నా నీడన చల్లగా బతుకుతున్న ప్రజలు అరాచకాలకు తెగబడతారేమో! అప్పుడు నా ఉనికే ప్రమాదంలో పడుతుంది. ముందే భూ గ్రహం మీద భూమి తక్కువ నీళ్లెక్కువ. గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని సముద్ర మట్టాలు పెరిగిపోయి మిగిలిన ఆ కాస్తా భూమి నీళ్ల పాలయితే అప్పుడు ప్రజలు పడవల్లో కాపురముండాలి. అప్పుడు సన్న బియ్యపు అన్నం బదులుగా ఉత్త చేపలనే తిని బతకాలి. కొంపదీసి కార్ల్ మార్క్స్ నేను నాశనమై పోవాలని పెట్టిన శాపం నిజమవుతుందో, పాడో! . అయినా కార్ల్ మార్క్స్ నేను అంటే రాజ్యాన్ని చచ్చి పోవాలని కోరుకున్నాడు గానీ ప్రజలు అంతమై పోవాలని ఆశించలేదు సుమా! ఆయనకు నేనంటే కోపం గానీ ప్రజలంటే ఇష్టమే. భూమి మీద జాగా తగ్గిపొయినందువల్లె కాబోలు కొందరు ఇతర గ్రహాల పైన వెతుక్కుంటున్నారు. ఉన్నదాన్ని కాపాడుకోలేని వాడు అక్కడికెళ్ళి మాత్రం ఎం వెలగ బెడతాడో! సరే భవిష్యత్తును ఖచ్చితంగా ఊహించడానికి ఇది సరైన సమయం కాదు కాబట్టి ప్రదేశం తాలూకు చర్చ ను ఇక్కడ వదలి మరో లక్షణం- అంటే ప్రభుత్వం కేసి చూద్దాం.
ప్రభుత్వం
నిజానికి సామాన్య వ్యక్తి నన్నూ , ప్రభుత్వాన్ని ఒకటే గానే ఊహించుకుంటారు. కాని ప్రభుత్వం నా తరఫున పనిచేసే ఒక ఏజెంట్ మాత్రమే. నేను శాశ్వతంగా ఉంటాను. ప్రభుత్వాలు మారిపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా రాజ్య లక్షణాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కానీ ప్రభుత్వం అలా కాదు. రకరకాల ప్రభుత్వాలున్నాయి. పార్లమెంటరీ ప్రభుత్వ మనీ, అధ్యక్ష తరహ, రాజరిక ప్రభుత్వమనీ రక రకాల ప్రభుత్వాలు న్నాయి. కానీ నా బాడ్ లక్ ఏంటంటే ప్రభుత్వ పనితీరు పైనే నా మంచి చెడ్డలు ఆధారపడి ఉన్నాయి. నేను మంచి రాజ్యాన్నా కాదా అన్న విషయం ప్రభుత్వం పనితీరు తేలుస్తుంది. కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తాయి. అంటే నిర్ణిత కాల వ్యవధిలో ఎన్నికలుంటాయి. ప్రజలు తమకు నచ్చిన వారికి నిర్ణిత కాలం కోసం అధికారాన్ని అప్పగిస్తారు. బాగా పనిచేస్తే మళ్లీ ఛాన్స్ వస్తుంది. లేకుంటే ఇంతే సంగతులు, ఇంటి దారే గతి. కొన్ని దేశాల్లో నిరంకుశ ప్రభుత్వాలుంటాయి. మరికొన్ని రాజ్యాలలో పైకి ప్రజాస్వామ్య ప్రభుత్వంలా కనిపించినప్పటికీ, అంతర్గతంగా సైన్యం ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. సైన్యం నడిపిన ప్రభుత్వం ఏదీ కూడా ప్రజల ఆమోదం పొందిన దాఖలా చరిత్రలో లేదు. సాధారణం గా ప్రభుత్వంలొ మూడు భాగాలు లేక అంగాలుంటాయి. 1. శాసన శాఖ 2. కార్య నిర్వాహక శాఖ 3. న్యాయ శాఖ. శాసన శాఖ శాసనాలు తయారు చేస్తుంది. కార్య నిర్వాహక శాఖ వాటిని అమలు పరుస్తుంది. ఇక ఈ రెండు శాఖలు అంటే శాసన, కార్య నిర్వాహక శాఖలు ఎప్పుడైనా ఎక్స్ ట్రాలు చేస్త్తే న్యాయశాఖ కల్పించుకొని న్యాయం చేస్తుంది. సరే న్యాయ శాఖ హద్దుమీరితే దాన్ని కుడా కట్టడి చెసే పద్ధతులున్నాయనుకోండి. మొత్తం మీద అధికార బాధ్యతలను సమతౌల్యం చేసుకుంటూ ప్రభుత్వం కొనసాగుతుంది. అయితే ఏదీ అనుకున్నంత ఈజీ గా ఉండదు కదా! అన్ని వ్యవస్థలు సరిగా పని చెస్తే ఇక సమస్యే లేదు కదా? సరే ప్రస్తుతానికి ప్రభుత్వం, దాని మూడు అంగాల కబుర్లను కాసేపు పక్కన బెట్టి చివరి లక్షణం - సార్వభౌమాధికారం సంగతి చూద్దాం.
సార్వభౌమాధికారం Sovereignty
ఇంతకు ముందు చెప్పిన లక్షణాలకు ఎంతొ కొంత భౌతిక విజిబిలిటీ ఉంది కాని సార్వభౌమాధికారానికి అలాంటి లక్షణం లెదు. కరంటు తీగ కనపడుతుంది కానీ కరంటు కనపడదు. కనపడటంలేదని తీగను ముట్టుకుంటే షాక్ కొట్టినట్లే సార్వభౌమాధికారాన్ని కదిపితే కూడా షాక్ కొడుతుంది సుమా! జాగ్రత్త ! ప్రజలు, ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు, మంత్రులు, అధికారులు, అన్ని సంస్థలు నా అధికారాన్ని అంగీకరించాల్సిందే. సార్వభోమాదికారానికి కొన్ని లక్షణాలున్నాయి. వాటిని గురించి చర్చించుకుందాం. అంతకంటే ముందు ఏదైనా ఒక నిర్వచనాన్ని చూద్దాం.
ఇంగ్లీష్ నిర్వచనం
“That characteristic of the state by virtue of which it cannot be legally bound except by its own or limited by any power other than itself. -Jellineck
పై నిర్వచనం ఎం చెబుతున్నదంటే తనకు తానుగా ఏర్పరుచుకున్న న్యాయ పరమైన పరిమితులకు తప్ప మరే ఇతర అధికారానికి లొంగని రాజ్య లక్షణం . ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి జేల్లినేక్. ఇంకా ఇలాంటి నిర్వచనాలు కావాలంటే ఇక్కడ ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి
లక్షణాలు
శాశ్వతత్వం: నా అధికారం శాశ్వతమైంది. అది నాతోనే ఎప్పుడూ ఉంటుంది
అవిభాజ్యం : నా సార్వభౌమాధికారాన్ని విభజించ లేము
నిరపేక్షమైనది : సార్వభౌమాధికారాన్ని పోలిన మరొక అధికారం ఎక్కడా ఉండదు.
అనన్యసంక్రామకము: ఈ అధికారాన్ని మరొకరికి బదిలీ చేయలేము.
ఇలా నా లక్షణమైన సార్వభౌమాదికారానికి కూడా కొన్ని లక్ష్నాలున్నాయి. ఇప్పుడైనా అర్ధమైందా నా గొప్ప తనం
కాబట్టి నా ప్రియమైన ప్రజలారా నా గురించి ఇంకా తెలుసుకోండి. మీ జీవితాలను ఇంకా సుఖమయం చేసుకోవడానికి నన్నూ, నా పనితీరును మార్చుకొండి మీరు చైతన్య వంతులైతే తప్ప ఇది సాద్య్హం కాదు మీరు అంటే ప్రజలు లేని నేను మానవ మాత్రుడు లేని ఎడారినో లేక మంచుతో నిండిన ఉత్తర దక్షిణ ద్రువాలో అవుతాను. నా పరిణామ దశలగురించి మరోసారి మాట్లాడుకుందాం ఇప్పటికి సెలవు.
ఇట్లు
మీ
రాజ్యం
రచయిత
ప్రదీప్ కుమార్, రిటైర్డ్ లెక్చరర్.
నిజామాబాద్
9849609959
jayadeep.kulkarni@gmail.com
రచయితగా నా మాట : కళా రూపాలను విద్య కోసం ఉపయోగించుకునే ప్రయత్నం లో భాగంగా ఈ రాజ్యం ఆత్మ కథ ను రాయడం జరిగింది. నేను ఎన్నుకున్న విధానం, ఇందులో చెప్పిన అంశాలు (కొత్తగా జొడించినవి కూడా ) మేధావుల విమర్శలకు అతీతమైనవి కావు. అక్షర దోషాలను మరీ భూతద్దంలొ చూడొద్దని మనవి. చర్చకోసం ఎదిరిచూస్తూ శలవు
రచయిత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి